: వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి నల్లపురెడ్డి రాజీనామా... వ్యక్తిగత కారణాలేనన్న నెల్లూరు నేత
వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన నిన్న నెల్లూరులో ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా, పార్టీని మాత్రం వీడబోనని నల్లపురెడ్డి స్పష్టం చేశారు. గత జూన్ లోనే ఆయన జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే నాడు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని నల్లపురెడ్డిని నిలువరించారు.