: 'ఓటుకు నోటు' కేసులో రెండు రోజుల్లో ఏపీ పోలీసులకూ నోటీసులు!
ఓటుకు నోటు కేసులో నిందితులు తప్పించుకునేందుకు ఏపీ పోలీసులు సహకరించారని భావిస్తున్న తెలంగాణ ఏసీబీ అనుమానితులకు నోటీసులిచ్చి విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేసులో నిందితుడు మత్తయ్య, కీలక ఆధారంగా మారిన జిమ్మీబాబు, లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డిలకు కొందరు తెలుగుదేశం నేతలు, పోలీసు అధికారులు ఆశ్రయం కల్పించారని ఏసీబీ పసిగట్టినట్టు సమాచారం. జిమ్మీబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ తెదేపా నేత ఇంట్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నిందితులు తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయేందుకు పోలీసులు సహకరించారని పక్కా ఆధారాలు రాబట్టినట్టు సమాచారం. నిందితులకు సహకరించారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసు అధికారులకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై రేపు ఏసీబీ అధికారులు సమావేశమై చర్చించనున్నారని తెలుస్తోంది. దీంతో సోమవారం నాడు ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు సంభవించవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.