: భారత ఈ-కామర్స్ సైట్లను ఏలుతున్న తెల్లతోలు మోడల్స్


మాయా రాయ్... తనకు బోర్ కొట్టినప్పుడు ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంది. తనకు నచ్చిన ఏదైనా డ్రస్ కనిపిస్తే, దాని గురించిన మరిన్ని వివరాలు చూసి తెలుసుకుంటుంది. ఇటీవల ఓ కుర్తీని ఆన్ లైన్లో చూసిన ఆమెకు ఓ డౌట్ వచ్చింది. ఆ డ్రస్ ధరించింది ఓ 'వైట్ మోడల్'. మరో సైట్లో పరిశీలించింది. అక్కడ కూడా దుస్తులను ధరించింది తెల్ల తోలున్న మోడల్సే. ఒక్క భారతీయ మోడల్ కూడా ఎక్కడా కనిపించలేదు. ఇది మాయాకు కొంత అసహనాన్ని కలిగించింది. దాదాపు అందరు ఈ-కామర్స్ సైట్ వినియోగదారులకు ఇది అనుభవమే. లో దుస్తుల నుంచి లెహంగాల వరకూ భారతీయులకు ఆన్ లైన్లో విక్రయిస్తున్న వెబ్ సైట్లు వాటిని ధరించి చూపే మోడల్స్ ను మాత్రం విదేశీయులను ఎంచుకుంటున్నారు. వెస్ట్రన్ వేర్ ఉత్పత్తులను చూపేందుకు వీరు సూటవుతారని అందరూ అంగీకరిస్తారు. ఇదే సమయంలో సంప్రదాయ భారత వస్త్రాలకు వీరు సరిగ్గా నప్పటం లేదన్న వాదన కూడా ఉంది. భారత ఫ్యాషన్ రిటైల్ మార్కెట్ వైట్ మోడల్స్ పైనే అధికంగా ఆధారపడి వుందని పరిశ్రమ నిపుణులు అంగీకరిస్తున్నారు. వెబ్ సైట్లలోనే కాదు, మెట్రో నగరాల్లోని బిల్ బోర్డులపై కూడా వైట్ మోడల్స్ దే రాజ్యం. దుస్తుల నుంచి ఆభరణాల వరకూ విక్రయించే సంస్థలు వీరినే ఎంచుకుంటున్నాయి. భారతీయ మోడల్స్ తో పోలిస్తే, వైడ్ మోడల్స్ తక్కువ ధరలకు లభిస్తుండటం వారినే ఎక్కువగా కాంట్రాక్టుల్లోకి తీసుకోవడానికి కారణమని అర్బన్ మోడల్ మేనేజ్ మెంట్ సేవలందిస్తున్న సంస్థ చీఫ్ కార్తీక్ జోబన్ పుత్రా తెలిపారు. వీరిపై వర్క్ లోడ్ కూడా అధికమేనని అన్నారు. విదేశీ మోడల్స్, వృత్తిలో ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారని, వారు సమయానికి షూట్ కు వచ్చి సహకరిస్తారని పలు బ్రాండ్లకు ఈ-కామర్స్ మోడల్స్ సేవలందిస్తున్న తెనోవియా సొల్యూషన్స్ అధినేత మురళీ బాలన్ వివరించారు. అపెరల్ ఇండస్ట్రీలో గ్లోబలైజేషన్ శరవేగంగా సాగుతున్నందున ఏ దేశపు మోడల్ అయినా ఒకటేనని ఫ్యాషన్ గురు ఎండీ ప్రసాద్ బిడప్ప అంచనా వేశారు. ఇండియన్ మోడల్స్ ను ఎంపిక చేసుకోవాలంటే, వారికి ప్రజల్లో కనీస గుర్తింపుండాలని, అటువంటి వారికి అధికంగా చెల్లించాల్సి వస్తుందని వెల్లడించిన ఆయన, అంతర్జాతీయ మోడల్స్ అయితే, గుర్తింపు లేకపోయినా సరిపోతుందని, పైగా తక్కువ రెమ్యునరేషన్ తోనే లభిస్తారని తెలిపారు. అందువల్లే ఈ-కామర్స్ సైట్లను వైట్ మోడల్స్ రాజ్యమేలుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News