: ముంబయి ఇండియన్స్ తోనే ఉంటా: పాంటింగ్
ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ తాను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీతోనే ఉంటానని అంటున్నాడు. ఆసీస్ జట్టు బ్యాటింగ్ సలహాదారు పాత్ర కోసం క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపుల్లో ఉన్నట్టు వచ్చిన వార్తలను పాంటింగ్ ఖండించాడు. యువ బ్యాట్స్ మెన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటానని, ఇప్పటికైతే కుటుంబం, ముంబయి ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలు, కామెంటరీ, స్పాన్సర్ షిప్ లు, పాంటింగ్ ఫౌండేషన్ కార్యకలాపాలకే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ (టీమ్ ఫెర్మార్మెన్స్) పాట్ హోవార్డ్ మాట్లాడుతూ... అత్యంత విజయవంతమైన కెప్టెన్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా రావడాన్ని ఇష్టపడతానని, ఇప్పటికే ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగాయని పేర్కొన్నారు. దాంతో, ఆసీస్ వ్యూహకర్తల బృందంలో పాంటింగ్ చేరనున్నాడన్న కథనాలు వెలువడ్డాయి.