: వరల్డ్ రికార్డు ఆశ్చర్యం కలిగించింది: రహానే


శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే (8 క్యాచ్ లు) వరల్డ్ రికార్డు నెలకొల్పడం తెలిసిందే. ఓ టెస్టులో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా రహానే రికార్డు పుటల్లోకెక్కాడు. దీనిపై రహానే మాట్లాడుతూ.... ప్రపంచ రికార్డు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. సహచరులు చెప్పేదాకా వరల్డ్ రికార్డు సాధించినట్టు తనకు తెలియదన్నాడు. "బ్రేక్ సమయంలో మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్ చెప్పారు. నువ్వు ప్రపంచ రికార్డు నమోదుచేశావన్నారు. దాంతో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. లంకతో టెస్టు సిరీస్ లో స్పిన్నర్లు బౌలింగ్ కు వచ్చినప్పుడు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయాలని కోహ్లీ ముందే చెప్పాడు. దాంతో, స్లిప్ ఫీల్డింగ్ కు సన్నద్ధమయ్యాను" అని వివరించాడు. అయితే, ఈ రికార్డు ఘనత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కే చెందుతుందని వినమ్రంగా బదులిచ్చాడు. ఐపీఎల్ సమయంలో ద్రావిడ్ స్లిప్ క్యాచింగ్ లో ఎన్నో విలువైన సలహాలిచ్చాడని, వాటిని పాటించానని తెలిపాడు. బంతిపై ఏకాగ్రత చెదరనీయరాదని ద్రావిడ్ ఎప్పుడూ చెప్పేవాడని గుర్తుచేసుకున్నాడు. టెస్టుల్లో కొన్నిసార్లు బంతిని పట్టుకునేందుకు ఎక్కువ సమయం ఉండదని, అలాంటప్పుడు చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుందని ద్రావిడ్ తెలిపాడని పేర్కొన్నాడు. ఈ సలహాను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే కాకుండా, మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్ చేస్తున్నా పాటిస్తానని ఈ ముంబైవాలా చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News