: స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ రాణిస్తుందా?
యాషెస్ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న మైకేల్ క్లార్క్ కు వారసుడిగా స్టీవెన్ స్మిత్ ను ఎంపికచేశారు. వైస్ కెప్టెన్ గా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు అవకాశమిచ్చారు. వార్నర్ వన్డేల్లోనూ స్మిత్ కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై సెలక్షన్ కమిటీ చైర్మన్ రాడ్నీ మార్ష్ మాట్లాడుతూ... గతవారం క్లార్క్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో, స్టీవెన్ స్మిత్ కే టెస్టు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్మిత్ ముందు పెను సవాళ్లు నిలిచి ఉన్నా, వాటిని ఎదుర్కొనేందుకు అతడు సమర్థుడేనని అందరూ భావించారని చెప్పారు. కాగా, ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు మరో టెస్టు మిగిలుండగానే 1-3 తో యాషెస్ సిరీస్ ను ఇంగ్లాండ్ కు అప్పగించింది. దాంతో, క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ క్లార్క్ రిటైర్మెంటు ప్రకటించాడు. 'యాషెస్' ఐదో టెస్టే తన చివరి టెస్టు అని ప్రకటించాడు. ఇప్పుడు టెస్టు కెప్టెన్ గా ఎంపికైన స్మిత్ ముందు ఎన్నో సమస్యలు నిలిచి ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కోల్పోయి నైరాశ్యంలో కూరుకుపోయిన జట్టులో ఉత్సాహం నింపాల్సి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లపై దారుణమైన ఆటతీరు కనబర్చిన ఆటగాళ్లలో స్ఫూర్తి కలిగించాల్సిన బాధ్యత స్మిత్ పైనే ఉంది.