: మనిషి కనిపించకుండా హెచ్చరికలు... విజయవంతమైన మెదక్ పోలీసుల ప్రయత్నం
"రెడ్ కలర్ మారుతీ కార్... రోడ్డుకు అడ్డంగా ఉంది వెంటనే తీసెయ్", "2435 నెంబర్ ఆటో... కాస్త ముందుకెళ్లి ఆపు", "టీస్టాల్ దగ్గర గుంపులేంటి... అక్కడి నుంచి బయలుదేరండి" ఇలా పోలీసుల హెచ్చరికలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, ఒక్క పోలీసు మాత్రం కనిపించడు. అటు పెరిగిన నేరాల సంఖ్య, ఇటు సిబ్బంది కొరతతో ఇబ్బందులు... వీటిని అధిగమించేందుకు అందివచ్చిన అధునాతన సాంకేతికతను వాడుకున్నారు మెదక్ పోలీసులు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసి వాటి పీఏ (పబ్లిక్ అడ్రసింగ్) వ్యవస్థలను పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి విజయవంతమయ్యారు. స్టేషన్ లోనే కూర్చుని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ, అప్పటికప్పుడు సూచనలు హెచ్చరికలు చేస్తుంటారు. ఏదైనా ఘర్షణ జరిగితే స్టేషనులో రికార్డవుతుందన్న భయమూ ప్రజల్లో పెరగడంతో నేరాల సంఖ్య కాస్త తగ్గింది. అన్నిటికన్నా ముఖ్యంగా, కాలుష్యం నిండిన రహదార్లపై గంటల పాటు నిలబడి భద్రతను పర్యవేక్షించాల్సిన పరిస్థితి తప్పిందని, స్టేషనులో కూర్చుని సీసీ కెమెరాలు చూస్తూ ఉండటం తమ ఆరోగ్యానికి మేలు కలిగిస్తోందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ లో చేపట్టిన ఈ టెక్నాలజీ వినియోగం సత్ఫలితాలు ఇవ్వడంతో, మిగతా పట్టణాల్లో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని తెలంగాణ హోం శాఖ భావిస్తోంది.