: తన 'యాక్షన్ హీరో' నరేంద్ర మోదీకి పాటను అంకితమిచ్చిన సెన్సార్ బోర్డు చైర్మన్


కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ ప్రధాని నరేంద్ర మోదీపై తన భక్తిని ఘనంగా చాటుకున్నారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఓ భజన తరహా గీతాన్ని మోదీకి అంకితం ఇచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ నినాదం 'హర్, హర్ మోదీ... ఘర్, ఘర్ మోదీ'ని రూపొందించిన బృందమే తాజా గీతాన్ని రూపొందించింది. మహాత్మా గాంధీ, నరేంద్ర మోదీల కలలను యువత నిజం చేయాలంటూ ఈ పాటలో పిలుపునిచ్చారు. "జో సప్నా దేఖా బాపు మోదీ నే, ఉస్ సే మిల్ జుల్ కర్ హమే సచ్ కర్ దిఖానా హై..." అంటూ పాట సాగుతుంది. ఈ పాట విషయమై నిహలానీ మీడియాతో మాట్లాడుతూ... మోదీ తప్ప తన చర్యల ద్వారా ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందేలా చేసిన నేత మరెవ్వరూ లేరని, అందుకే ఆయనకు అంకితమిచ్చినట్టు వివరించారు. ఈ పాటను స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేస్తారు. అయితే, నిహలానీ తీరుపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తికి రాజకీయాలతో పనేంటని అన్నారు. అందుకు నిహలానీ బదులిస్తూ... ఆ పాట ప్రధాని మోదీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిందని, ఏ రాజకీయ పార్టీ కోసమో తయారుచేయలేదని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) చీఫ్ పదవిని అధిష్ఠించే వేళ... బీజేపీ వ్యక్తినని చెప్పుకునేందుకు గర్విస్తానని, ప్రధాని మోదీ తన 'యాక్షన్ హీరో' అని నిహలానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News