: మళ్లీ తిప్పేస్తున్న అశ్విన్... కష్టాల్లో లంక
గాలే టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి శ్రీలంకను కష్టాల్లోకి నెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో లంక పతనానికి కారణమైన ఈ తమిళతంబి రెండో ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసి, భారత్ పై స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అయితే, ఆటకు నేడు మూడో రోజే కావడం, లంక చేతిలో మరో 4 వికెట్లే ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మాథ్యూస్ సేన 183 పరుగులు చేయగా, భారత్ 375 పరుగులు చేసింది. అటుపై రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంకకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పిన్ తో షాకిచ్చాడు. కొత్త బంతిని స్పిన్నర్ల చేతికిచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని అశ్విన్, మిశ్రా వమ్ముచేయలేదు. ఓపెనర్ కరుణరత్నేను అశ్విన్ బౌల్డ్ చేయగా, మరో ఓపెనర్ సిల్వాను మిశ్రా బౌల్డ్ చేశాడు.