: అమెరికా, ఆస్ట్రేలియా సైట్లను హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్, 1400 మందిని చంపుతామని హెచ్చరిక
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దృష్టి అమెరికా, ఆస్ట్రేలియాలపై పడింది. ఈ రెండు దేశాల రక్షణ రంగం, ప్రభుత్వ విభాగాల్లోని వెబ్ సైట్లను హ్యాక్ చేసిన ఉగ్రవాదులు 1400 మంది ఉన్నతాధికారుల పూర్తి వివరాలను సేకరించింది. వీరందరినీ త్వరలోనే చంపేస్తామని ఐఎస్ఐఎస్ వెల్లడించినట్టు ఆస్ట్రేలియా దినపత్రిక 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "మీ కదలికలను మేము గమనిస్తున్నాం. మీరు ఉపయోగిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మా సభ్యులున్నారు. మీ పర్సనల్ డేటా మా దగ్గరుంది. మీ బంధుమిత్రుల వివరాలు కూడా ఉన్నాయి. త్వరలోనే మిమ్మల్ని మీ దేశంలోనే మట్టుపెడతాం. మా జాబితాలో విక్టోరియా ఎంపీ కూడా ఉన్నారు" అని ఐఎస్ఐఎస్ హ్యాకింగ్ విభాగం ఒక ప్రకటనలో తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. ఉద్యోగుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాలను ఉగ్రవాదులు ఆన్ లైన్లో విడుదల చేశారని పేర్కొంది.