: ముష్కరులేనా?... హైదరాబాదు పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానాలు నిజమేనని తేలుతున్నాయి. ఇప్పటికే అసోంలోని కోక్రాఝర్ వద్ద రైల్వే లైను పేల్చేసేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైన్యం తరిమికొట్టింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాదులో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, కొద్దిసేపటి క్రితం నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, విచారణలో భాగంగా వారికి ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధాలున్నాయని తేల్చినట్లు సమాచారం. ఈ మేరకు మరిన్ని వివరాలు రాబడుతున్న పోలీసులు నేటి సాయంత్రం ఆ నలుగురు వ్యక్తులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాద సంస్థలకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న మరో 15 మంది యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.