: ప్రధానిగా సేవలందించినా 'ఎర్రకోట' ఎక్కలేకపోయిన ఆ ఇద్దరు!
దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రధాని జెండా ఎగురవేయడమన్నది సంప్రదాయంగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, దేశానికి ప్రధానులుగా పనిచేసిన ఇద్దరికి ఆ అవకాశం దక్కలేదు. వారే గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్. 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన నందా, అదే సంవత్సరం జూన్ 9న రాజీనామా చేశారు. ఆపై మరోసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మృతి తరువాత ప్రధానిగా మళ్లీ సేవలందించినా, కొద్ది రోజులకే ఇందిరా గాంధీకి బాధ్యతలు అప్పగించాల్సి రావడంతో ఆయన ఎర్రకోట ఎక్కలేపోయారు. ఇక 1990 నవంబర్ 10న దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖర్ 1991 జూన్ 21న పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ఆయన కూడా ఎర్రకోటపై పతాకావిష్కరణ చేయలేకపోయారు. కాగా, జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లు, వాజ్ పేయి 6 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ లు రెండు సార్ల చొప్పున ఎర్రకోటపై ప్రధాని హోదాలో జెండా ఎగురవేశారు.