: మరో 25 ఏళ్లు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉంటా... ప్రజలు తన వెంటేనన్న రేవంత్ రెడ్డి
మరో 25 ఏళ్ల పాటు కొడంగల్ ఎమ్మెల్యేగానే ఉంటానని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం హైదరాబాదులోని ఏసీబీ కోర్టుకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి, మరో 25 ఏళ్ల పాటు కొడంగల్ లో తనకు అపజయమే లేదన్నారు. కొడంగల్ ప్రజలకు తనపై పూర్తి విశ్వాసముందని, వారంతా తన వెంటే ఉన్నారని పేర్కొన్న ఆయన ఇకపై అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై విరుచుకుపడ్డారు. పదవీ విరమణ పొందిన రాజా సదారాంను మళ్లీ ఆ పదవిలో కొనసాగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజా సదారాం టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై కోర్టులో పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.