: ఆ ఎరుపు రంగు పొట్టి స్కర్టు ఎందుకు వేసుకున్నానంటే...: సీక్రెట్ చెప్పిన రాధేమా
స్వయం ప్రకటిత దేవత రాధేమా, తాను ఎరుపు రంగు పొట్టి దుస్తులను ధరించడం వెనకున్న నిజాన్ని వెల్లడించింది. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తన భక్తులు ఏం కోరితే దాన్ని తాను తీర్చాల్సిందేనని, ఆ స్కర్ట్ వేసుకున్నది భక్తుల కోసమేనని చెప్పేసింది. తనకు అత్యంత దగ్గరి భక్తులతో కలసి విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని, భక్తులను ఆనందంగా ఉంచేందుకు ఆ పొట్టి డ్రస్ వేసుకున్నానని, అందులో తప్పేంటని ప్రశ్నించింది. తన భక్తులే ఆ దుస్తులను తనకు ధరింపజేసి మేకప్ వేశారని తెలిపింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు వాటిని విడుదల చేశారని ఆరోపించింది. వీటిని ప్రచురించడం మీడియా తప్పని, ఈ తరహా చర్యలు తనకు బాధ కలిగించాయని వెల్లడించింది. ప్రస్తుతం తన వద్ద రూ 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు లేదని, ఈ విషయంలో సీబీఐ చేతనైనా విచారణ జరిపించుకోవచ్చని తెలిపింది. కాగా, రాధేమా ఎరుపు రంగు దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.