: ఒక నేతకు ఒకే పదవి... 2000 మందికి పదవులు పంచనున్న కేసీఆర్!
ఒక నేతకు ఒకే పదవి ఇచ్చే విధానాన్ని అమలు చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులను పంచాలని తెరాస అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడం ద్వారా తెరాస శ్రేణులను సంతృప్తి పరచాలని ఆయన అనుకొంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగానే ఉండటంతో, తీవ్ర పోటీ నెలకొంది. పలు కార్పొరేషన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో సుమారు రెండువేల పదవుల భర్తీకి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 180 మార్కెట్ కమిటీలు ఉండగా, వీటి వరకూ రిజర్వేషన్ విధానాన్ని అవలంబించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మార్కెట్ కమిటీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేయాలని, మంత్రివర్గంలో స్థానం లేని మహిళల విభాగానికి, మరిన్ని పదవులు ఇవ్వాలని ఆయన అనుకొంటున్నారు. ఈ పదవులు ఎవరికివ్వాలన్న విషయమై పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ మంత్రులు కలసి జాబితా రూపొందిస్తున్నారు. ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన వారికి, స్థానికంగా పేరున్న నేతలకు పదవులు లభిస్తాయని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో అన్ని జిల్లాల నుంచి జాబితాలు కేసీఆర్ వద్దకు చేరతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.