: అందుబాటు ధరల్లోనే ఎస్ యూవీలు... త్వరలో వెలువడనున్న కొత్త కార్లు ఇవే!


ఇండియాలో కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్)ల అమ్మకాలు పెరుగుతున్నాయి. 2013లో మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్, ఆపై ఈకో స్పోర్ట్స్ నుంచి ఇటీవలి హ్యుందాయ్ క్రెటా వరకూ అన్నీ కస్టమర్లను ఆకర్షించాయి. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి, దిగువ ఉన్నత తరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు అపారమైన భారత కార్ మార్కెట్ ను అందుకుని సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటా పొందేందుకు కొత్త వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించాయి. సమీప భవిష్యత్తులో విడుదల కానున్న కొత్త కార్లలో కొన్ని... మారుతి సుజుకి విటారా: 2014లో పారిస్ మోటార్ షోలో మారుతి సుజుకి ఈ కారును తొలిసారిగా ప్రదర్శించింది. ఐవీ-4 కాన్సెప్ట్ లో ఎక్స్ఏ ఆల్ఫా ప్లాట్ ఫాంపై తయారైన వాహనం ఇది. ఇది 5 మీటర్ల కన్నా తక్కువ పొడవులో ఉంటుందా? ఉండదా? అన్న విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎస్ క్రాస్, సియాజ్ లలో వాడిన 1.3 లీటర్ డీడీఐఎస్ ఇంజన్ నే ఇందులో కూడా వాడారు. 2016 ఆరంభంలో మార్కెట్లోకి రానున్న ఈ కారు ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 7 నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని అంచనా. హోండా బీఆర్-వీ: గత నెలలో ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ వాహన ప్రదర్శనలో ఈ కారు తొలిసారి పలకరించింది. హోండా బ్రియో ప్లాట్ ఫాంపైనే సరికొత్తగా అభివృద్ధి చేసిన మోడల్ ఇది. ఇందులో ఏడుగురు సులభంగా ప్రయాణించవచ్చు. 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్, 1.5 లీటర్ ఐ-డీటెక్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు కూడా వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్ ను తాకుతుందని సమాచారం. దీని ధర రూ. 6.50 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుంది. మహీంద్రా టీయూవీ 300: ఇది సబ్-కాంపాక్ట్ యస్ యూవీ. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ కారుకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా. శక్తిమంతమైన ఎంహాక్ 80 డీజిల్ ఇంజనుతో రానుంది. ఈ సంవత్సరం దసరా-దీపావళి సీజనులో విడుదల కానున్న కారు ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 6 లక్షల నుంచి రూ. 8.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News