: అతిపెద్ద పతనానికి ముగింపు పలికి, తిరిగి దూసుకెళ్లిన బంగారం ధర
బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని భావించిన వారికి నిరాశ కలిగింది. వారం రోజుల క్రితం రూ. 24 వేల వద్ద ఉన్న పది గ్రాముల బంగారం ధర, తిరిగి కొండెక్కి కూర్చుంది. రోజుల వ్యవధిలో రూ. 26 వేలను దాటి పోయింది. చైనా కరెన్సీ విలువ తగ్గడం నుంచి, అమెరికా డాలర్ బలపడటం, ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి నుంచి ఇండియాలో శ్రావణమాసపు శుభవేళ మొదలు కావడం వరకూ బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దాదాపు 15 సంవత్సరాల తరువాత బంగారం ధరల్లో నెలకొన్న భారీ పతనం ముగిసింది. ఐదున్నరేళ్ల కనిష్ఠ స్థాయుల వద్ద ఉన్న ఈ ధర, ప్రస్తుతం రెండు నెలల నాటి స్థాయికి చేరింది. 1999 తరువాత బులియన్ మార్కెట్ 7 వరుస వారాల పాటు నష్టపోతూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, నేటి బులియన్ సెషన్ ఆరంభంలోనే పుత్తడి ఒత్తిడికి గురైంది. బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 120 తగ్గి రూ. 25,895 వద్ద కొనసాగింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.1 శాతం తగ్గి, 1,113.15 డాలర్లకు చేరింది. బంగారం పతనం ప్రస్తుతానికి ముగిసినట్టేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రపంచ మార్కెట్లలో బులియన్ సెంటిమెంటును దెబ్బతీసేలా ఏవైనా నిర్ణయాలు వెలువడితే, ధరలు మరోసారి దిగివస్తాయని చెబుతున్నారు. వారం పది రోజుల క్రితం బంగారం కొనుగోలు చేసిన వారు సంతోషపడుతుంటే, మరింత తగ్గుతుందని చూసిన వారు 'అయ్యో' అనుకోవాల్సిన పరిస్థితి.