: ముందు నుయ్యి, వెనుక గొయ్యి!... ఇదీ ప్రముఖుల గన్ మెన్లు, డ్రైవర్ల పరిస్థితి


తెలుగు రాష్ట్రాల మధ్య వేడి రాజేసిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాలు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల గన్ మెన్లు, కారు డ్రైవర్ల పాలిట శాపంలా మారాయి. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్లతో పాటు గన్ మెన్లను కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కొందరికి నోటీసులిచ్చి విచారించగా, మరికొందరిని కేవలం ఫోన్ కాల్ తో తమ కార్యాలయానికి రప్పించుకున్నారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి కూడా మొన్న నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న విచారణకు రావాల్సిన కొండల్ రెడ్డి ఏసీబీ నోటీసులకు స్పందించలేదు. దీంతో అతడికి మరోమారు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ భావిస్తోంది. టీ ఏసీబీ నోటీసులకు ప్రతిగా ఏపీ పోలీసులు కాస్త గట్టిగానే ప్రతిస్పందిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్ మెన్లకు నోటీసులు జారీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రముఖుల గన్ మెన్లు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నామో, వారి సూచనల మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్న గన్ మెన్లు, డ్రైవర్లు తామేదో తప్పు చేననట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి ముందు నొయ్య, వెనుక గొయ్య మాదిరి తయారైందని వారు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News