: డిపాజిటర్లను ముంచిన మరో సంస్థ ... రూ.5 కోట్లతో బోర్డు తిప్పేసిన 'సెవెన్ హిల్స్ ఇండియా'
అతి తక్కువ కాలంలో సొమ్మును రెట్టింపు చేసి ఇస్తామని లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారం ఇంకా తేలనే లేదు. అప్పుడే ఏపీలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని దినసరి కూలీలే లక్ష్యంగా మరో సంస్థ నయా మోసానికి పాల్పడింది. ఏపీ సరిహద్దు కర్ణాటక పట్టణం కోలార్ కేంద్రంగా ‘సెవెన్ హిల్స్ ఇండియి ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట 2011లో రంగప్రవేశం చేసిన ఓ సంస్థ ఇప్పటిదాకా దాదాపు రూ.5 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. కేవలం కంప్యూటర్ స్లిప్పులనే బాండ్లుగా జారీ చేసిన ఆ సంస్థ సదరు స్లిప్పుల మీద ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాల సిబ్బందితోనే సంతకాలు చేయించింది. ఏజంట్లకు ఆకర్షణీయ కమీషన్లను ముట్టజెప్పిన ఆ సంస్థ టార్గెట్ చేసిన అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో డిపాజిట్లు సేకరించింది. ఈ సంస్థ తొలుత జారీ చేసిన బాండ్ల కాల పరిమితి 2017తో ముగియనుంది. సేకరించిన డిపాజిట్లలో సింగిల్ డిపాజిట్ కు కూడా తిరిగి చెల్లింపులు చేయకుండానే సెవెన్ హిల్స్ బోర్డు తిప్పేసింది. అనంతపురం జిల్లాలోని కదిరిలోని ఆ సంస్థ ప్రాంతీయ కార్యాలయం రెండు నెలలుగా మూసే ఉంది. అనుమానం వచ్చిన డిపాజిటర్లు ఆరా తీయగా, సిబ్బంది సరిగా స్పందించలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కదిరి కార్యాలయ మేనేజర్ వీరన్నతో పాటు నాగార్జున, బాబ్ జాన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.