: విభజన సక్రమంగా జరిగి ఉంటే సమస్యలు జటిలం అయ్యేవి కాదు: చంద్రబాబు


రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నో చారిత్రక తప్పిదాలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీతో పోరాడుతోందని అన్నారు. రాజకీయాల్లో టీడీపీ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో 1956లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తదనంతర పరిణామాలతో దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత ఏర్పడిన పరిణామాల వల్ల రెండో ఎస్సార్సీ వేశారని ఆయన గుర్తు చేశారు. 1968-1969లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఆయన చెప్పారు. ఆ తరువాత 1972-1973లో ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ వచ్చాక విభజన వంటి మాటలు కట్టిపెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. ఆ క్రమంలోనే టీడీపీ 2004 ఎన్నికల్లో సమైక్య నినాదంతో ముందుకు వెళ్లి ఓటమిపాలైందని ఆయన తెలిపారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా, పార్టీలోని నేతలతో చర్చించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన గతం గుర్తు చేసుకున్నారు. ఆ తరువాతే ఉద్యమంలో ఊపు వచ్చిందని ఆయన చెప్పారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను 2004లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి కుంభకోణాల్లో మునిగితేలిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని సహజవనరులను కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు. సుమారు లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం, మరో లక్షా 76 వేల రూపాయల 2జీ కుంభకోణం, జగన్ అవినీతి, గాలి కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. కుంభకోణాలకు పాల్పడడమే కాకుండా అస్తవ్యస్త విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల కోనసీమ లాంటి ప్రాంతాల్లో క్రాప్ హాలీడే ప్రకటించిన విషయం ఆయన గుర్తు చేశారు. కుంభకోణాలు, విధానాల వల్ల పరువు పోయిందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ, రోజుకో నాటకానికి తెరతీసిందని ఆయన విమర్శించారు. తరువాత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 2009లో టీఆర్ఎస్ పొత్తుతో ప్రజల్లోకి వెళ్లినా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యామని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో చాలా మార్పు వచ్చిందని టీడీపీ విజయం సాధించిందని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో 'ప్రజారాజ్యం' లేకపోయి ఉంటే విజయం టీడీపీని వరించి ఉండేదని ఆయన పేర్కొన్నారు. సినీ నటుడు చిరంజీవి రంగంలోకి దిగడం వల్లే 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని ఆయన చెప్పారు. అయితే కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్, పదవులు అనుభవించిన టీఆర్ఎస్ ఉద్యమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో కేసీఆర్ దీక్ష చేపట్టడం, అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటనతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, ప్రజల్లోని భావోద్వేగాన్ని సొమ్ముచేసుకోవాలని భావించిన సోనియా గాంధీ 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా దానిని శాస్త్రీయంగా ఇవ్వలేదని మండిపడ్డారు. అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేశారో కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. కమిటీ ఇచ్చిన రిపోర్టును పట్టించుకోకుండా రాష్ట్ర విభజన ప్రకటన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఎత్తుగడలు వేసిందని ఆయన ఆరోపించారు. విభజన సక్రమంగా జరిగి ఉంటే సమస్యలు జటిలం అయ్యేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండేవారని బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News