: సానియా నాకు దరిదాపుల్లో లేదు... ఆమెకు ఖేల్ రత్న ఎలా ఇస్తారు?: పారా హైజంపర్ గిరీశ
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అవార్డుల వ్యవహారం మరోసారి వివాదాస్పదం అయింది. తాజాగా, ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఓ పారా హైజంపర్ తన ఆవేదన వెళ్లగక్కాడు. 'ఇది అన్యాయం' అంటూ ఎలుగెత్తాడు. 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా తనకు దరిదాపుల్లోలేదని తెలిపాడు. సానియా గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన విషయం తనకు తెలుసని, కానీ, క్రీడా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 2011 నుంచి జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఏషియాడ్, కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్స్ లో ప్రదర్శనలే ఈ అవార్డు కోసం పరిగణనలోకి తీసుకుంటారని వివరించాడు. "ఇది అన్యాయం. నన్ను విస్మరించి సానియాను ఎంపిక చేశారు. 2012లో నేను పతకం సాధించినప్పుడు నరేంద్ర మోదీగారు గుజరాత్ సీఎంగా ఉన్నారు. నన్ను తొలిగా అభినందించింది ఆయనే. ఇప్పుడాయన నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఇలా చేయడం విచారకరం" అని ఆవేదన వెలిబుచ్చాడు. అంతేగాకుండా, క్రికెటర్ ధోనీకి ఖేల్ రత్న ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించాడీ కర్ణాటక అథ్లెట్. "2013లో నేను ఖేల్ రత్నకు దరఖాస్తు చేసుకుంటే... అర్జున అవార్డు అందుకున్నవాళ్లే ఈ అవార్డుకు అర్హులని చెప్పారు. అలాగైతే, ధోనీకి 2007-08లో ఖేల్ రత్న ఎలా ఇచ్చారు?" అని ప్రశ్నించాడు.