: 'చెప్పుల' వివాదంలో మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే
మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన చెప్పులను సిబ్బందితో మోయించడం మీడియాలో కనిపించింది. రాష్ట్రంలో కరవుతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో... పర్భని జిల్లా సోన్ పేట్ వచ్చిన పంకజ బురదతో కూడిన రోడ్డుపై నడిచేందుకు వీలుగా తన స్లిప్పర్స్ ను విడిచారు. ఆమె సిబ్బందిలోని ఓ వ్యక్తి ఆ చెప్పులను చేతబట్టుకు రావడం మీడియా కెమెరాలకు చిక్కింది. ఈ క్లిప్పింగ్ వార్తా చానళ్లలో విశేషంగా ప్రసారమైంది. ఇకేముందీ... విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్టయింది. ఆమెది అహంకారపూరిత ధోరణి అంటూ కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై స్పందించిన పంకజ "మీడియా నేను చెప్పులు విడవడం, వాటిని మరొకరు మోయడమే చూసింది. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి నేను పడ్డ బాధలు మీడియా చూసిందా? రోడ్డు బురదమయం కావడంతో చెప్పులు విడిచి నడిచాను. నా చెప్పులు వేరొకరు పట్టుకుని వచ్చారన్న విషయం కూడా నాకు తెలియదు. తర్వాత తెలిసింది. అయినా, ఆ వ్యక్తి ప్రభుత్వోద్యోగి కాదు, వ్యక్తిగతంగా నేను నియమించుకున్న ఉద్యోగి. మీడియా చూపాల్సింది ఇలాంటివి కాదు... కరవు, రైతుల పరిస్థితులను వార్తాంశాలుగా చూపాలి" అని పేర్కొన్నారు.