: ఆమె వాగ్ధాటి...కాకలు తీరిన కురువృద్ధునికి కన్నీళ్లు రప్పించింది
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వాగ్ధాటికి బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ నయనాలు వర్షించాయి. పార్లమెంటులో ఎంతో మంది నేతలను చూసిన ఆయన లలిత్ గేట్ అంశంలో సుష్మ తనను తాను సమర్థించుకున్న వైనానికి, ప్రత్యర్థుల ఆరోపణలకు అడ్డుకట్ట వేసిన తీరుకు ముగ్ధుడయ్యారు. సుమారు అర్ధ గంటపాటు అనర్గళంగా సాగిన సుష్మ ప్రసంగానికి ఆయన చలించిపోయారు. దీంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. ఆమె వాదన ముగిసిన అనంతరం పక్కనే కూర్చున్న అద్వానీ శభాష్ అంటూ అభినందించారు. పార్లమెంటులో అత్యంత అనుభవజ్ఞుడైన నేతగా ఎల్ కే అద్వానీకి గౌరవం ఉంది. కాగా, వయోభారం కారణంగానో, లేక ఇతర కారణాల వల్లో కానీ ఆయన ప్రస్తుత రాజకీయాల్లో గతంలో ఉన్నంత చురుకుగా లేరనేది నిర్వివాదాంశం.