: లోక్ సభను ఆకట్టుకున్న వెంకయ్య పిట్టకథ
లలిత్ గేట్ వివాదంపై లోక్ సభలో జరిగిన చర్చ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మంత్రిని అకారణంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా లోక్ సభకు ఓ పిట్ట కథ వినిపించారు. పిట్ట కథ వివరాల్లోకి వెళ్తే... ఓ ఇద్దరు వ్యక్తులు మద్రాసు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై గొడవ పడుతున్నారు. దీంతో వారిద్దరి చుట్టూ కొంత మంది గుమికూడారు. వారిలో ఓ పెద్దమనిషి ఎందుకు గొడవ పడుతున్నారని అడిగారు. అతనిని తగువు తీర్చమని కోరారిద్దరూ. దీంతో అంగీకరించిన ఆయన అసలు విషయం చెప్పమని అడిగారు. దీంతో గొడవకు కారణమైన వ్యక్తి మాట్లాడుతూ, 'అయ్యా నాకు ఆయన 25 వేల రూపాయలు ఇవ్వాలి, అడిగితే ఇవ్వడం లేదు' అని ఆరోపించాడు. దీంతో రెండో వ్యక్తి మాట్లాడుతూ, 'అయ్యా అసలు అయనెవరో నాకు తెలియదు. ఆయనను చూడడం ఇదే తొలిసారి. ట్రైన్ దిగుతున్న నన్ను డబ్బులివ్వాలంటూ అడుగుతున్నాడు' అని చెప్పాడు. దీంతో ఆలోచించిన పెద్దమనిషి 'నీకు ఎంతివ్వాలి?' అని అడిగాడు. '25 వేలు' అని చెప్పాడు. 'నువ్వేమంటావ్?' అని రెండో వ్యక్తిని అడిగితే...'నేనివ్వాల్సిన అవసరం లేద'ని సమాధానమిచ్చాడు. దీంతో ఆ పెద్దమనిషి 'సరే ఓ 15 వేలు ఇవ్వు' అని తీర్పు చెప్పివెళ్లిపోయాడని అన్నారు. కాంగ్రెస్ తీరు కూడా అలాగే ఉందని అన్నారు. సభలో చర్చకు అవకాశం ఇవ్వకుండా, సభను సజావుగా జరగనివ్వకుండా అడ్డుకోవడం సరైన విధానం కాదని అన్నారు.