: రెండు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా గాలెలో జరుగుతున్నా మొదటి టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు చేసిన 183 పరుగులకు 55 పరుగుల దూరంలో తొలి రోజు ఆటముగించింది. తొలుత బౌలింగ్ లో రాణించిన టీమిండియా, బ్యాటింగ్ లోనూ నిలకడ ప్రదర్శించింది. ఆదిలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), రోహిత్ శర్మ (9) వికెట్లు కోల్పోయినా శిఖర్ ధావన్ (53), విరాట్ కోహ్లీ (45) రాణించడంతో టీమిండియా తొలి రోజు సెంచరీ మార్కును దాటింది. వీరిద్దరూ నిలదొక్కుకుంటే భారత్ విజయం నల్లేరుమీద నడకేనని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, శ్రీలంక బౌలర్లలో ప్రసాద్, మాధ్యూస్ చెరో వికెట్ తో రాణించారు. మరో నాలుగు రోజుల ఆట మిగిలి ఉండగా, ప్రస్తుతానికి టెస్టులో విజయావకాశాలు భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. అయితే క్రికెట్ లో ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో విజయంపై రెండు జట్లు ఆశాభావంతో ఉన్నాయి.