: నల్లధనం తెస్తామంటే ఎలాగో అనుకున్నాం...ఇలా తెస్తారని ఊహించలేదు!: సుష్మపై రాహుల్ సెటైర్
తప్పు చేశారు కనుకే ఇంత కాలం మౌనంగా ఉన్నారా? అని లోక్ సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, సుష్మా స్వరాజ్ ప్రపంచంలోనే తొలి మానవతావాదిలా మాట్లాడుతున్నారని అన్నారు. 'పోనీ మానవత్వంతోనే సుష్మా స్వరాజ్ ఆర్థిక నేరగాడు లలిత్ మోదీకి సహాయం చేశారని అనుకుందాం. ఆ సహాయం అంత సీక్రెట్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది?' అని ఆయన నిలదీశారు. లలిత్ మోదీ కేసులను వాదించే లాయర్ సుష్మా స్వరాజ్ భర్త కావడం వల్లే ఆమె కాపాడాల్సి వచ్చిందా? అని నిలదీశారు. లలిత్ మోదీకి సాయం చేయడం వెనుక ఎంత నల్లధనం చేతులు మారిందని ఆయన అడిగారు. నల్లధనం దేశానికి తీసుకువస్తామని కేంద్రం చేబితే ఈ రకంగా తెస్తారని ఊహించలేదని ఆయన అన్నారు. సుష్మా స్వరాజ్ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పిన ఆయన, లలిత్ మోదీకి సహాయం ప్రధానికి చెప్పే చేశారా? అని అడిగారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడను, పాల్పడనివ్వనని దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని దీనిపై ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.