: యాషెస్ గెల్చినా కౌంటీ జట్టుకు పనికిరాకుండా పోయాడు!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ లో ప్రతిభ, ఆవేశం సమ్మిళితమై వినోదం పరవళ్లెత్తుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు కొదమసింహాలై తలపడతారు. హోరాహోరీగా సాగే ఈ సిరీస్ ను చేజిక్కించుకున్న జట్టుకు అభిమానులు నీరాజనాలు పలుకుతారు. విజయం సాధించిన జట్టు కెప్టెన్ అయితే మొనగాడే. తాజా యాషెస్ సిరీస్ లో మరో టెస్టు మిగిలుండగానే జయభేరి మోగించడం ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ కూడా పతాక శీర్షికలకెక్కాడు. కానీ, కౌంటీల్లో సొంత జట్టయిన ఎసెక్స్ మాత్రం కుక్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసింది. కుక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కు పనికిరాడని తేల్చిన ఆ జట్టు వ్యూహకర్తలు దేశవాళీ టి20 టోర్నీలో అతను అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఎసెక్స్ జట్టు గురువారం వార్విక్ షైర్ తో టి20 టోర్నీ క్వార్టర్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, కుక్ తో జట్టు కోచ్ పాల్ గ్రేసన్, కెప్టెన్ ర్యాన్ టెన్ డష్కాటే మాట్లాడారు. టోర్నీ ఆరంభం నుంచి ఆడుతున్న జట్టుతోనే బరిలో దిగుతున్నామని కుక్ కు చెప్పారు. కుక్ కూడా తమ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించాడని గ్రేసన్ తెలిపారు. కొన్నాళ్లుగా కుక్ ను ఇంగ్లాండ్ బోర్డు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి దూరం పెట్టింది. కుక్ సేవలు టెస్టు క్రికెట్లోనే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కాగా, ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు మొయిన్ అలీ, వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఇయాన్ బెల్ తదితరులు కౌంటీల్లో తమ జట్లకు ఆడేందుకు సిద్ధమయ్యారు.