: లలిత్ మోదీ అంశంపై లోక్ సభలో చర్చ ప్రారంభం... తొలగిన ప్రతిష్ఠంభన
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ అంశంపై లోక్ సభలో ఎట్టకేలకు చర్చ ప్రారంభమైంది. దాంతో రెండు వారాలుగా సభలో ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగిపోయింది. కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభలో మాట్లాడుతూ, మనీల్యాండరింగ్ కేసులో లలిత్ మోదీ ఐటీ శాఖ ఎదుట విచారణకు హాజరుకాలేదని, దాంతో అతని వీసాను సీజ్ చేశారని పేర్కొన్నారు. అతనొక ఆర్థిక నేరస్థుడన్నారు. అందుకే అతనికి వ్యతిరేకంగా గత ఆర్థికమంత్రి ఇంగ్లండ్ కు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఆ ఆర్థిక నేరస్థుడికి సుష్మాస్వరాజ్ ఏ విధంగా సాయం చేస్తారని ఖర్గే ప్రశ్నించారు. ఈ విషయంలో సుష్మ చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం ఎందుకు అంగీకరించట్లేదని ప్రశ్నించారు. లలిత్ పై చర్యలకు ఆర్థికమంత్రి జైట్లీ ఎందుకు ఉపక్రమించట్లేదని నిలదీశారు. కాగా ప్రధాని సభకు వచ్చి తమ వాదన వినాలని, ఆయనను సభకు పిలవాలని ఖర్గే కోరారు. ఆయన రేడియో, టీవీల్లో మాట్లాడతారు కానీ సభలో మాట్లాడరని ఎద్దేవా చేశారు. అందుకే తమ వాదన విని సభలో సమాధానం చెప్పాలన్నారు. తమ వాదనను ప్రధాని వినకపోతే చర్చకు ప్రయోజనం లేదన్నారు. అయితే తాము రూల్ 56 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తే, విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సెక్షన్ 193 కింద చర్చకు అనుమతించారని ఆరోపించారు. చర్చించి సమస్య ముగిసిందని చెప్పేందుకే నిబంధన 193 అని పెదవి విరిచారు.