: చైనా వద్దనుకొని ఇండియాకు వస్తున్న టెక్ దిగ్గజం!


చైనాలో నెలకొన్న పరిస్థితులు తమ సంస్థకు అనుకూలంగా లేవని భావిస్తున్న తైవాన్ టెక్ దిగ్గజం 'ఫాక్స్ కాన్', ఇండియాలో భారీ ఎత్తున విస్తరణ ప్రణాళికలను రూపొందించింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయాలని భావించిన 5 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 45 వేల కోట్లు) ఇండియాలో పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ప్రత్యేక కథనంగా ప్రచురించింది. "ఫాక్స్ కాన్ కొత్త ప్లాంటు స్థాపన కోసం చైనా స్థానంలో ఇండియాను ఎంచుకుంది. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో అవకాశాలను వెతుక్కుంటోంది" అని 'చైనా డాట్ ఆర్గ్' తెలిపింది. కాగా, ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థగా, స్మార్ట్ ఫోన్ల తయారీ కేంద్రంగా ఉన్న ఫాక్స్ కాన్ యాపిల్ ఐ-ఫోన్లకు అవసరమైన విడిభాగాలను తయారు చేసి అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జియోమీ ఫోన్లను తయారు చేసిచ్చే కాంట్రాక్టులనూ పొందింది. చైనా నుంచి ఫాక్స్ కాన్ వెళ్లిపోవడం ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యాపిల్, శాంసంగ్, డెల్ తదితర ప్రముఖ కంపెనీలు చైనా కేంద్రంగా ప్రొడక్టులను తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఫాక్స్ కాన్ ఉంది. ఫాక్స్ కాన్ తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను, పలు రకాల టెక్ ప్రొడక్టులను తయారు చేసి ప్రముఖ బ్రాండ్లకు ఇస్తుండటంతో, ఆయా సంస్థలు చైనాపై మక్కువ పెంచుకున్నాయి. ఇక ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారడం, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండటం తదితర కారణాలతో భవిష్యత్ విస్తరణకు ఇండియా అనుకూలమన్న భావన నెలకొంది. చైనాలో విస్తరించిన ఓ పెద్ద సంస్థ ఇండియాకు మారిపోవాలని భావించడం మాత్రం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News