: రూపాయిపై చైనా కరెన్సీ దెబ్బ!


చైనా తన కరెన్సీ 'యువాన్' విలువను తగ్గిస్తున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ ప్రభావం భారత కరెన్సీపై స్పష్టంగా కనిపించింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది. బుధవారం నాడు ఫారెక్స్ సెషన్ మొదలు కాగానే రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒక శాతానికి పైగా పడిపోయింది. సెప్టెంబర్ 2013 తరువాత తొలిసారిగా రూపాయి విలువ 64.85కు చేరింది. రూపాయితో పాటు పలు దేశాల కరెన్సీ విలువలు సైతం పడిపోయాయి. "యువాన్ విలువను తగ్గించడం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడింది. చైనాతో వాణిజ్య సంబంధాలున్న అన్ని దేశాల కరెన్సీలూ ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి" అని ఫెడరల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ ఖజూరియా వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లో యువాన్ అసలు విలువను తెలుసుకుందామని భావిస్తున్న చైనా వరుసగా రెండో రోజూ కరెన్సీ ట్రేడింగ్ పై ఆంక్షలు పెట్టకపోవడంతో బుధవారం సైతం ఆ దేశ కరెన్సీ భారీగా పడిపోయింది. రెండు రోజుల్లో యువాన్ విలువ 4 శాతం పతనం కాగా, డాలర్ తో పోలిస్తే నాలుగేళ్ల కనిష్ఠస్థాయికి చేరుకుంది. మరోవైపు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా కనిపించింది. సెషన్ ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ అత్యంత కీలకమైన 8,400 పాయింట్ల స్థాయికి చేరుకుంది. చైనాలోని కంపెనీలకు ఎగుమతులు చేసే భారత సంస్థల ఈక్విటీ విలువలు తగ్గిపోయాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ 65 రూపాయలను దాటుతుందని నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మహమ్మద్ ఘజియానీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News