: కాంగ్రెస్ ‘న్యూస్ చానెల్’ వస్తోంది!
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సాగించిన వినూత్న ప్రచారం ఆయనకు ఘన విజయం సాధించిపెట్టింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం సాగిన రాహుల్ గాంధీ అంతగా రాణించలేకపోయారని సొంత పార్టీ నేతలే తేల్చేశారు. సోషల్ మీడియా లాంటి కొత్త తరం ప్రసార సాధనాలను వినియోగించుకోలేని వైనంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు పార్టీ కార్యక్రమాలు, ఎజెండా ప్రజల్లోకి వెళ్లడం లేదని ఏకే ఆంటోని లాంటి పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీవీ మాధ్యమాన్ని వినియోగించుకునే దిశగా చర్యలు చేపడుతున్నామని నిన్న ఏకే ఆంటోని ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ప్రస్తుతం కేరళ పీసీసీ ఆధ్వర్యంలో ‘జైహింద్’ చానెల్ నడుస్తోందని, దీనిని జాతీయ వార్తా చానెల్ గా మార్చే దిశగా ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు.