: నేను బీజేపీలో ఉంటే మోదీ ప్రధాని అయ్యే వారు కాదు, ఆనందిబెన్ సీఎం అయ్యే వారు కాదు: వాఘేలా
కాంగ్రెస్ నేత శంకర్ సింగ్ వాఘేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో కొనసాగి ఉంటే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవారు కాదని అన్నారు. 90వ దశకంలో కాషాయదళాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సీనియర్ రాజకీయవేత్త యూపీఏ-1లో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. తాజాగా, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పార్టీ సమావేశంలో వాఘేలా గురించి చెబుతూ, ఆయన ఇప్పుడు గనుక బీజేపీలో ఉండి ఉంటే గుజరాత్ సీఎం అయ్యేవారని పేర్కొన్నారు. దీనిపై వాఘేలా స్పందిస్తూ... "ఆమెతో నేను ఏకీభవిస్తున్నా. బీజేపీలోనే ఉండాలని ఆనాడు నేను నిర్ణయించుకుని ఉంటే... సర్ (మోదీ) ప్రధాని అయ్యే వారు కాదు, పటేల్ మన (గుజరాత్) ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు" అని వ్యాఖ్యానించారు. తాను ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది అధికారం కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, బీజేపీని వీడిన వాళ్ల స్థితి ఏమంత బాగాలేదని చెప్పాలని ఆనందిబెన్ భావించారని, కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారని వివరించారు. అటుపై, లాబీయింగ్ తో పనిలేకుండానే యూపీఏ హయాంలో క్యాబినెట్ మినిస్టర్ పదవి ఇచ్చారని ఈ గుజరాత్ విపక్ష నేత తెలిపారు. 90వ దశకంలో మోదీ, కేశుభాయ్ పటేల్ లతో విభేదాల కారణంగా వాఘేలా బీజేపీని వీడి, వేరు కుంపటి పెట్టుకున్నారు. 1996లో రాష్ట్రీయ జనతా పార్టీ స్థాపించి గుజరాత్ కు సీఎం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.