: బ్రిటన్ రాణి పాల్గొనే కార్యక్రమాలను టార్గెట్ చేసిన ఐఎస్!
ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన జిహాదీలు బ్రిటన్ లో దాడులకు సిద్ధంగా ఉన్నారన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కరే వెళ్లి లక్ష్యాలపై దాడులు చేసేందుకు అవసరమైన శిక్షణ పొందారని, వారి లక్ష్యం బ్రిటన్ లో రాణి, రాజ కుటుంబీకులు పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాల తాలూకు సంస్మరణ సభలేనని బ్రిటీష్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న జిహాదీల్లో కొందరు సిరియాలో శిక్షణ పొందినవారని తెలుస్తోంది. ఈ వివరాలను ఐఎస్ నుంచి రాబట్టేందుకు స్కై న్యూస్ మీడియా సంస్థ ఓ ఎత్తుగడ వేసింది. జిహాద్ కు నిబద్ధులైన వ్యక్తులు అంటూ రెండు కల్పిత పాత్రలతో ఐఎస్ ను ఆకర్షించింది. ఆ కల్పిత వ్యక్తులు ఓ పురుషుడు, ఓ మహిళ కాగా... వారు ట్విట్టర్లోనూ, ఇతర చాటింగ్ వేదికలపైనా చేసే సంభాషణలు ఐఎస్ ను నమ్మించే విధంగానే సాగాయి. దాంతో, వారు తమకు విధేయులని నమ్మిన ఐఎస్ సీనియర్లు మార్గదర్శక పుస్తకాలను పంపారు. నిధుల సేకరణ, ఆయుధాల తయారీకి సంబంధించిన సలహాలు ఆ పుస్తకాల్లో పొందుపరిచారు. ఈ క్రమంలోనే సదరు కల్పిత పాత్రలు బ్రిటన్ లో ఉన్న ఐఎస్ జిహాదీలతో చాట్ చేయగా, బ్రిటన్ రాణి పాల్గొనే కార్యక్రమాలపై దాడి వివరాలు కూడా తెలిశాయి.