: అద్వానీ ముడుపులు స్వీకరించాడంటోన్న కేజేపీ నేత
భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో పదవిని కాపాడుకునేందుకు గాను అప్పట్లో యెడ్యూరప్ప.. అద్వానీకి ముడుపులిచ్చాడని మాజీ ఎంపీ, కర్ణాటక జనతా పార్టీ నేత ధనంజయ కుమార్ అంటున్నారు. యెడ్యూరప్ప అవినీతి వల్లే రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ఠ మసకబారిందని అద్వానీ ఆరోపించిన మరుసటి రోజే కేజేపీ ఎదురుదాడికి దిగింది. యెడ్యూరప్పను విమర్శించే నైతిక హక్కు అద్వానీకి లేదని ధనంజయ్ కుమార్ పేర్కొన్నారు.
కాగా, ధనంజయ్ ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కొట్టిపారేశారు. ప్రస్తుతం బళ్ళారిలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తోన్న రాజ్ నాథ్ ఈ విషయమై స్పందిస్తూ.. ఆ ఆరోపణలు నిరాధారమంటూ, పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. యెడ్యూరప్ప బీజేపీని వీడిని తర్వాత కర్ణాటక జనతా పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే.