: సల్మాన్ ఖాన్ కు బుర్రలేదు: రాజ్ థాకరే విమర్శలు
తన దీర్ఘకాల స్నేహితుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే విరుచుకుపడ్డారు. యాకూబ్ మెమన్ ఉరితీత విషయంలో సల్మాన్ వైఖరిపై కోపగించుకున్న ఆయన 'బుర్ర లేనోడు' అని వ్యాఖ్యానించారు. "సల్మాన్ ఖాన్ కు బుర్రలేదు. ఆయన తండ్రి ఓ గౌరవించదగ్గ వ్యక్తి. సల్మాన్ రోజూ పేపర్ చదవడు. ఆయనకు చట్టం గురించి తెలియదు. అందువల్లే యాకూబ్ కు అనుకూలంగా ట్వీట్ చేశాడు. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రశ్నించవచ్చా?" అని రాజ్ ట్వీట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో శిక్షపడ్డ తరువాత తాను సల్మాన్ ఇంటికి వెళ్లడాన్ని రాజ్ సమర్థించుకున్నారు. తమ కుటుంబం, సల్మాన్ కుటుంబం చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉన్నాయని అందువల్లే తాను పరామర్శకు వెళ్లానని స్పష్టం చేశారు. కాగా, యాకూబ్ ఉరితీతకు ముందు "నేనీ వ్యాఖ్య చేసేందుకు మూడు రోజులు ఆలోచించా. భయపడ్డా కూడా. పారిపోయిన యాకూబ్ సోదరుడిని ఉరితీయాలి. ఓ అమాయకుడి చంపడం మానవత్వాన్ని చంపడమే" అని ట్వీట్ చేసి సల్మాన్ ఖాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే.