: ముగ్గురు యువతులు సహా ఐదుగురు కలిసి 2 వేల మందికి టోకరా!
ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కలిసి సుమారు 2 వేల మంది నిరుద్యోగులకు టోకరా ఇచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన షేక్ జానీ అలియాస్ సందీప్ (23) డిగ్రీవరకూ చదువుకొని 2013లో హైదరాబాదు, చందానగర్ లోని ఓ ఆఫీసులో బాయ్ గా చేరాడు. అక్కడే పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన కోనగాని అనిల్ అలియాస్ పోచయ్య (24)తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. మల్కాజిగిరికి చెందిన స్వాతి, శ్రీజ, వైష్ణవిలను ఉద్యోగులుగా పెట్టుకున్నారు. అందరూ ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆపై వీరి దందా మొదలైంది. కూల్ డ్రింక్ కంపెనీలు, బిస్కెట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, రూ. 18 నుంచి రూ. 25 వేల వరకూ వేతనాలు ఇప్పిస్తామని పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. వీటిని చూసి ఎవరైనా నిరుద్యోగులు ఫోన్ చేస్తే, రిజిస్ట్రేషన్, దరఖాస్తుల కింద రూ. 1000 తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకుని, ఆపై ఫోన్ నంబర్లు మార్చేవారు. ఇలా 2 వేల మంది నుంచి రూ. 20 లక్షలకు పైగా వసూలు చేశారు. ఈ నెల 9న పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా, భారీ ఎత్తున బ్యాంకు కార్డులు, సిమ్ కార్డులతో పట్టుబడటంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారిస్తే, అసలు నిజం బయటపడింది. వీరి నుంచి 12 సెల్ ఫోన్లు, ఉపయోగించిన, ఉపయోగించని 62 సిమ్ కార్డులు, 12 డెబిట్ కార్డులు, 8 పాన్ కార్డులు, 18 ఓటర్ ఐడీలు, 9 చెక్ బుక్స్, రూ. 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని, కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.