: ‘అభివృద్ధి’లోనూ సచిన్ మాస్టరే!...ఎంపీల దత్తత గ్రామాల్లో పుట్టంరాజు కండ్రిగ అగ్రస్థానం
క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేరుకున్న స్థాయికి దాదాపు ఎవరూ చేరుకోకపోవచ్చేమో. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ క్రికెట్ ఆడిన సచిన్ భారత కీర్తి ప్రతిష్ఠలను పెంచడమే కాక వ్యక్తిగత రికార్డులను సైతం చరిత్ర పుటల్లో పదిలం చేసుకున్నారు. తాజాగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆటగాళ్లకు రాజకీయాలేం తెలుసు? వారేం అభివృద్ధి చేస్తారు? అన్న వారి నోళ్లకు సచిన్ తాళమేశారు. ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించిన సచిన్... నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పర్యటించిన సచిన్, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం ఏంపీల దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఎలా జరుగుతోందన్న విషయంపై కేంద్రం దృష్టి సారించింది. ఎంపీలు దత్తత తీసుకున్న ఏఏ గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళుతున్నాయన్న విషయంపై సమగ్ర వివరాలు సేకరించింది. ఈ వివరాల ప్రకారం సచిన్ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ అన్ని గ్రామాల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో ఆ గ్రామంలో రూ.6 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. అభివృద్ధి ఫలాలు ప్రజల దరి చేరాయట. ఈ కారణంగానే ఆ గ్రామం ఈ జాబితాలో టాప్ పొజిషన్ చేజిక్కించుకుంది. దీంతో నాడు సచిన్ దత్తత తీసుకోవడం, నేడు ఉత్తమ దత్తత గ్రామాల్లో టాప్ లో నిలవడంతో పుట్టంరాజు కండ్రిగ మరోమారు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.