: బీసీసీఐపై కోర్టుకెక్కిన ముంబయి క్రికెటర్
ముంబయి రంజీ క్రికెటర్ హికెన్ షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయంపై బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అవినీతికి పాల్పడ్డాడంటూ అతడిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. తోటి ఆటగాడిని ప్రలోభ పెట్టేందుకు హికెన్ షా యత్నించాడన్నది అతనిపై ఉన్న ఆరోపణ. సదరు ఫ్రాంచైజీ (రాజస్థాన్ రాయల్స్) ఫిర్యాదు మేరకు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన బోర్డు అవినీతి వ్యతిరేక విభాగం షా తప్పు చేసినట్టు గుర్తించింది. యాంటీ-కరప్షన్ కోడ్ ను షా ఉల్లంఘించినట్టు నిర్ధారించారు. దాంతో, బీసీసీఐ అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దానిపై తన న్యాయవాది సోమ్ సింహ్ సాయంతో హైకోర్టుకెక్కాడు షా. బోర్డు సస్పెన్షన్ నిర్ణయం ప్రకటించే ముందు, వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని షా ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రత్యుత్తరం ఇవ్వాలంటూ బీసీసీఐని ఆదేశించింది. ఆగస్టు 12న తదుపరి విచారణ ఉంటుంది.