: మునికోటి మృతిపై ప్రధాని స్పందిస్తే బాగుండేది: ప్రత్తిపాటి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మత్యాగానికి పాల్పడడం అందరినీ బాధించిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన ఓ వార్తా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ... ఇకపై ఎవరూ ప్రత్యేక హోదా కోసం ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం చంద్రబాబు, బీజేపీ నేత వెంకయ్యనాయుడు తదితరులు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి కూడా దీనిపై స్పందించి, స్పష్టత ఇచ్చివుంటే బాగుండేదని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ఆలోచిస్తోందని నిర్మలా సీతారామన్ వంటి మంత్రులు చెబుతున్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. ప్రత్యేక హోదా విషయమై ఈ నెల 16 తర్వాత చంద్రబాబు ప్రధానిని కలుస్తారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని, ఒకవేళ రాకుంటే, ప్రత్యేక హోదాకు సమానమైన నిధులు కోరాలని నిర్ణయించుకున్నామని వివరించారు.