: రేపటి బంద్ లో పాల్గొననివారు ఆంధ్రా ద్రోహులు... ఆ రెండూ కలిస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది: శివాజీ
రేపు (మంగళవారం) ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... టాలీవుడ్ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బంద్ లో పాల్గొననివారు ఆంధ్రా ద్రోహులని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రభుత్వంతో ప్రతిపక్షం చేయి కలిపితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్రం తప్పించుకోరాదని అన్నారు. ప్రత్యేక హోదా ప్రజలకు సంబంధించిన విషయమని, చంద్రబాబు దీనిపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఎవరు ధర్నా చేసినా అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అటు, కేంద్ర మంత్రులకు శివాజీ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంటును అవమానపరిచేలా మాట్లాడొద్దని అన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని వెంకయ్యనాయుడుకు ఎవరైనా చెప్పాలని సూచించారు.