: మరో రకం క్రికెట్ ను తెస్తా, బ్లూప్రింట్ సిద్ధమైంది: లలిత్ మోదీ
ఒలింపిక్స్ కు అనుబంధంగా ఉండేలా, అన్ని ప్రపంచ దేశాలనూ భాగం చేస్తూ, సరికొత్త క్రికెట్ గవర్నింగ్ బాడీ త్వరలో రానుందని, దానికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధమైందని, ఐపీఎల్ సృష్టికర్త, భారత పోలీసుల విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న లలిత్ మోదీ సోమవారం నాడు వ్యాఖ్యానించాడు. అక్రమంగా డబ్బు తరలింపు, టెలివిజన్ ప్రసారాల హక్కుల విషయంలో అక్రమాలు తదితర కేసులను ఎదుర్కొంటున్న ఆయన, మరో క్రికెటింగ్ సిస్టమ్ రానుందని ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. దీన్ని జనరంజకంగా తయారు చేసేందుకు సంవత్సరాల తరబడి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపాడు. అప్పట్లో ఈ ప్రాజెక్టు నుంచి తనను బలవంతంగా గెంటేశారని అన్నాడు. ఐసీసీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు దీన్ని తయారు చేశానని చెప్పాడు. ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న మోదీ, ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ క్రికెట్ రంగాన్ని ఇతర దేశాలకు దగ్గర చేయాలన్నదే తన అభిమతమని అన్నాడు. ఆ ప్రాజెక్టుపై తిరిగి మనసు పెట్టానని, ఇది కార్యరూపం దాల్చేందుకు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరమని, నగదు సమీకరణ పెద్ద కష్టం కాదని అంటున్నాడు. ఐసీసీకి పోటీగా ఉండే ఈ కొత్త క్రికెట్ వ్యవస్థలో వన్డే పోటీలుండవని, టీ-20లు, టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఉంటాయని అన్నాడు.