: తెలంగాణలో మంచం పట్టిన ‘ఆరోగ్యశ్రీ’... రెండు నెలలుగా ఆగిపోయిన బిల్లుల చెల్లింపు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించింది. గుజరాత్ తర్వాతి స్థానం తమదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఏడాది తిరిగేలోగానే పరిస్థితి తారుమారైంది. ఉద్యోగుల వేతనాల కోసం కూడా ప్రభుత్వం గత నెల నానా ఇబ్బందులు పడింది. ఇతర పనులకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపేసి మరీ ఉద్యోగుల వేతనాలు చెల్లించింది. నిన్నటికి నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ కు తాళమేసిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత తెరిచారు. తాజాగా పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ఆరోగ్యశ్రీ’ మంచం పట్టింది. రెండు నెలలుగా ఈ పథకానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించడం లేదు. రెండు నెలలకే కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్లకు చేరాయి. ఆరోగ్యశ్రీ చెల్లింపుల కోసం అట్టిపెట్టుకున్న నిధులను ప్రభుత్వం వైద్య విద్యకు బదలాయిస్తోందట. కార్పొరేట్ ఆస్పత్రులు బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.