: క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే వచ్చే ఉద్యోగం పోయినట్టే... ఎలాగంటే!


క్రెడిట్ స్కోర్... ఓ బ్యాంకు ఖాతాదారుడు, తన ఖాతాలోని డబ్బులను ఎలా ఖర్చు పెడుతున్నాడు? రుణాలు తీసుకుంటే వాటి చెల్లింపులో పాటిస్తున్న సమయపాలన, ఇచ్చిన చెక్కులకు తగ్గట్టు నగదు నిల్వలను కొనసాగించడం తదితర ఎన్నో అంశాలపై ఆధారపడి 'సిబిల్' ఇచ్చే స్కోర్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, ఆ ఖాతాదారుడికి అన్ని ఎక్కువ బ్యాంకు సేవలు అందుతాయి. క్రెడిట్ స్కోరు తగ్గే కొద్దీ, అతను లేదా ఆమెలో బాధ్యతారాహిత్యం ఎక్కువని బ్యాంకులు అభిప్రాయానికి వచ్చి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తదితరాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తాయి. ఇప్పటివరకూ పశ్చిమ దేశాల్లో ఉద్యోగులను ఎంపిక చేసే కంపెనీలు, నిరుద్యోగుల క్రెడిట్ స్కోరును పరిశీలిస్తుండగా, ఇప్పుడదే ట్రెండ్ ఇండియాలోనూ మొదలైంది. ఓ ఉద్యోగిలో బాధ్యతారాహిత్యం ఎక్కువగా ఉంటే, అది అతని పనితీరుపై ప్రభావం చూపి సంస్థ ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక ఉద్యోగం ఇచ్చే ముందు నిరుద్యోగి బ్యాక్ గ్రౌండ్ ను పరిశీలించడం మానవ వనరుల విభాగం విధి. ఇందులో భాగంగానే క్రెడిట్ రిపోర్టును వారు పరిశీలిస్తున్నారు. విద్యార్హతల పరంగా తృప్తిగా ఉన్నప్పటికీ, క్రెడిట్ స్కోర్ బాగాలేకుంటే, వారిని విధుల్లోకి తీసుకోకపోవడమే మంచిదని సంస్థలు భావిస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ తగ్గకుండా చూసుకోవాలంటే... మీరు గతంలో ఇచ్చిన రెండు మూడు చెక్కులు బౌన్స్ అయ్యాయనుకోండి. దాని ప్రాతిపదికన మరో రుణమిచ్చేందుకు బ్యాంకులు అంగీకరించవు. ఈ విషయం మీ క్రెడిట్ స్కోర్ పై పెను ప్రభావం చూపుతుంది. ఇక మీరు నెలకు రెండు మూడు సార్లు బార్లకు వెళ్లి ఫ్రెండ్స్ తో గడిపి అక్కడ మీ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే, మీపై తాగుబోతన్న ముద్ర పడిపోతుంది. క్రెడిట్ కార్డులు వాడుతూ, హైఎండ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి, ఆపై ఆ డబ్బును నెలవారీ కనీస మొత్తాలను కడుతూ, తీరుస్తుంటే కూడా మీరు బాధ్యతారాహిత్యాన్ని చూపుతున్నట్టే లెక్క. బ్యాంకు ఖాతాలను అవసరానికి మించి ఖర్చు పెడుతున్నా కూడా తెలిసిపోతుంది. ఆన్ లైన్లో దొరుకుతున్నాయి కదా అని కార్డులు వాడుతూ పలు రకాల ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నా, మీ ఆదాయం ఎంతన్న విషయమై ఆధారపడి క్రెడిట్ స్కోరు మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రతికూల ప్రభావమూ పడవచ్చు. క్రెడిట్ స్కోరును తగ్గించే అంశాలపై కాస్తంత జాగ్రత్తగా ఉంటేనే చేతిదాకా వచ్చిన మంచి ఉద్యోగం దూరం కాకుండా ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News