: లోకేష్ మధ్యవర్తిత్వం వల్లే టీడీపీలో చేరా: జేసీ దివాకర్ రెడ్డి
కేవలం తన కుమారుడు రాహుల్ ను ప్రధాని చేయాలనే దురుద్దేశంతోనే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు కూడా తీరని అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. వైకాపా అధినేత జగన్ కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో టీడీపీలో చేరానని చెప్పారు. నారా లోకేశ్ మధ్యవర్తిత్వం వల్లే టీడీపీలో చేరాలన్న తుది నిర్ణయానికి వచ్చానని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే లేవని అన్నారు. మొన్న అనంతపురంలో జరిగిన రాహుల్ గాంధీ సభకు స్థానికులు ఎవరూ రాలేదని... కర్ణాటక నుంచి జనాలను తరలించారని జేసీ ఎద్దేవా చేశారు. జగన్ కు ఇంకా రాజకీయ అవగాహన పెరగాలని అన్నారు. పరిటాల కుటుంబంతో వైరం గతమని... ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని జేసీ చెప్పారు. డబ్బు ఖర్చు చేయకుండా ఏ నాయకుడు గెలిచే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు.