: నాడు సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం, నేడు 'ప్రత్యేక హోదా' కోసం ఆత్మబలిదానం
ఆ యువకుడికి ఉద్యమాలే ఊపిరి. ఆయన సమైక్యాంధ్ర కల కల్లలైంది. ఆనాటి నుంచి ఒంటరి జీవితం గడుపుతూ, కనీసం ప్రత్యేక హోదా అయినా వచ్చి రాష్ట్రం బాగుపడుతుందని భావించాడు. అదీ రాదేమోనని బెంగపడ్డాడు. తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన పోరు సభకు వెళ్లాడు. నేతల ప్రసంగాలు వింటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒంటికి నిప్పంటించుకుని తనువు చాలించాడు. తిరుపతిలోని మంచాల వీధికి చెందిన మునికామకోటి ఏపీ విడిపోకూడదని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తిరుపతిలోని ప్రముఖ గంగమ్మ దేవాలయంలో కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. మునికోటికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, భార్యతో మనస్పర్థలతో పదేళ్ల క్రితం విడిపోయాడు. కోటి తండ్రి, తల్లి మృతి చెందడంతో, తన తమ్ముడి ఇంట్లో ఉంటుండేవాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదని బంధువులు, మిత్రులతో చర్చిస్తుండేవాడు. మునికోటి ప్రాణాలు విడిచాడని తెలిసి అతని సోదరుడు మురళి, ఇతర కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. మునికోటి త్యాగం ఊరికే పోదని, ప్రత్యేక హోదాకై మరింతగా ఉద్యమిద్దామని, ప్రాణాలు మాత్రం ఎవరూ తీసుకోవద్దని నేతలు అంటున్నారు. మునికోటికి నివాళులర్పించేందుకు తిరుపతికి వెళ్లాలని వివిధ ప్రాంతాల నుంచి పలువురు నేతలు బయలుదేరుతున్నారు.