: నాడు కుట్రలు చేసి నేడు మొసలి కన్నీరా? కాంగ్రెస్ పై కేఈ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆనాడు విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, నాడు హోదాపై కుట్ర చేసి, నేడు అదే పార్టీ వారు మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకువచ్చి తీరుతారని ఆయన అన్నారు. విభజన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇప్పుడెంత కన్నీరు కార్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం తిరుపతిలో యువకుడు అత్మహత్యాయత్నానికి పాల్పడటం ఎంతో బాధను కలిగించిందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానని కేఈ అన్నారు.