: 'స్వచ్ఛభారత్' సర్వేలో పరిశుభ్రమైన నగరంగా బెంగళూరు
దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా బెంగళూరు నిలిచింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమ నేపథ్యంలో భారత్ లోని 476 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బెంగళూరు మొదటిస్థానాన్ని దక్కించుకుంది. ఇదే క్రమంలో మొదటి పది నగరాల్లో కర్ణాటక నుంచి ఐదు నగరాలు చోటు సంపాందించుకున్నాయి. నగరాల పరిశుద్ధత, వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలను పరిధిలోకి తీసుకుని నగరాల శుభ్రతను అంచనా వేశారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీ నగర అర్బన్ ప్రాంతాలు, ఢిల్లీ కంటోన్మెంట్ 15వ ర్యాంకులో వున్నాయి. ఇక ఏపీ నుంచి మూడు నగరాలు, తెలంగాణ నుంచి రెండు నగరాలు ఈ సర్వేలో స్థానం సంపాదించాయి. టాప్ 100లో విజయనగరం (58), నర్సరావుపేట (59), గుంటూరు (70), వరంగల్(33), నిజామాబాద్(82) ఉన్నాయి. చివరి స్థానాల్లో హిందూపూర్(457), ఆదిలాబాద్(349) స్థానం దక్కించుకున్నాయి.