: రాధే మా మమ్మల్ని తల్లిదండ్రుల్లా భావిస్తారు: బాలీవుడ్ డైరక్టర్ సుభాష్ ఘాయ్
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త 'రాధే మా' ఎంతో మంచి వ్యక్తి అంటున్నారు బాలీవుడ్ సీనియర్ డైరక్టర్ సుభాష్ ఘాయ్. ఆమెపై వివాదాలు ముసురుకోవడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. "నేను, మా ఆవిడ ముక్తా... మాతా విష్ణుదేవి భక్తులం. గతేడాది 'రాధే మా' భక్తులు బోరివాలి భవన్ లో నిర్వహించిన 'మాతా కి చౌకి' కార్యక్రమానికి హాజరయ్యాం. అప్పటి నుంచి మేం కూడా 'రాధే మా' భక్తులుగా మారిపోయాం. ఆపై మా నివాసంలో నిర్వహించిన మాతా కి చౌకి కార్యక్రమానికి 'రాధే మా' విచ్చేసి దీవెనలు అందించారు. మాతో ఎంతో ఆప్యాయంగా మసలుకునేవారు. నన్ను, ముక్తాను తల్లిదండ్రులుగా భావించేవారు. ఆమె అసభ్యంగా ప్రవర్తించడం గానీ, తప్పుగా మాట్లాడడం గానీ ఎప్పుడూ గమనించలేదు. ఇప్పుడిలా ఆమెపై వార్తలు రావడం బాధాకరం. ఆమెకు భజనలు, భక్తిగీతాలంటే ఎంతో ఇష్టం. భక్తుల ముందు చిన్నపిల్లలా నర్తించేవారు. భక్తులను తన పిల్లల్లా భావిస్తారు. విదేశాలకు వెళుతుంటానని, షాపింగ్ చేయడం ఇష్టపడతానని, అన్నింటికీ మించి, ఓ సాధారణ అమ్మాయిలా ఉండడాన్ని ఇష్టపడతానని మాతో చెప్పారు. త్వరలోనే ఆమె ఈ సంక్షోభం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ హర్" అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.