: ఉధంపూర్ ఘటనకు సూత్రధారి ఎవరో తెలిసింది!
కొన్ని రోజుల క్రితం భద్రతా బలగాలకు పట్టుబడ్డ లష్కరే తోయిబా టెర్రరిస్టు నవీద్ అలియాస్ ఉస్మాన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు విచారిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి ఘటనకు సూత్రధారి జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తనయుడు తల్హా అని ఉస్మాన్ చెప్పినట్టు తెలిసింది. హఫీజ్ సయీద్ తనయుడు తల్హా లష్కరే తోయిబాలో రిక్రూట్ మెంట్లు, శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు. భారత్ కు పంపేముందు ఇద్దరు టెర్రరిస్టులకు తల్హా ఆదేశాల మేరకే శిక్షణ ఇచ్చారట. దాడులు జరిపే బాధ్యతను తల్హా... మధ్య, దక్షిణ కాశ్మీర్ లష్కర్ చీఫ్ అబు ఖాసిమ్ కు అప్పగించగా, ఖాసిమ్ చెప్పిన మేరకే ఉస్మాన్, నౌమాన్ బీఎస్ఎఫ్ దళాలపై దాడికి దిగారని కథనాలు చెబుతున్నాయి. ఆ దాడిలో నౌమాన్ హతం కాగా, అనంతరం నవీద్ ను నాటకీయ ఫక్కీలో గ్రామస్తులు పట్టుకున్నారు. హతుడైన నౌమాన్... హఫీజ్ సయీద్ అంగరక్షకుడన్న నిజం ఆలస్యంగా తెలిసింది.