: పాక్ ఉగ్రవాది నవేద్ అడ్రస్, కుటుంబ వివరాలు ఇవే...!


కసబ్ తర్వాత భారత్ కు ప్రాణాలతో దొరికిన మరో పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్. విచారణలో తాను పాకిస్థాన్ నుంచే వచ్చానని నవేద్ వెల్లడించాడు. నవేద్ తన కుమారుడే అని అతని తండ్రి మొహమ్మద్ యాకుబ్ కూడా స్పష్టం చేశాడు. తనకు లష్కరే తోయిబా, పాక్ సైన్యం వల్ల ప్రాణ హాని ఉందని కూడా తెలిపాడు. అయితే పాకిస్థాన్ మాత్రం ఎప్పట్లాగానే నవేద్ తమ దేశానికి చెందిన వాడు కాదని స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే, నవేద్ కు చెందిన పూర్తి వివరాలను ఒక జాతీయ మీడియా సంస్థ సేకరించింది. ఆ సంస్థ ప్రతినిధి ప్రాణాలను ఒడ్డి నవేద్ ఇంటిని, వీధిని చిత్రీకరించారు. పాకిస్థాన్ లోని ఓల్డ్ ఫైసలాబాద్ లో గులాం మొహమ్మదాబాద్ ప్రాంతంలో నవేద్ కుటుంబం నివసిస్తోంది. స్థానిక రఫీక్ కాలనీలోని 3వ రోడ్డు చివర్లో నవేద్ ఇల్లు ఉంది. వీధి మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. కొత్త వారు కనిపిస్తే అనుమానాస్పదంగా చూసే జనాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. జనాల రాకపోకలను పరిశీలిస్తున్నట్టుగా ఉన్నాయి అక్కడి ప్రజల చూపులు. అక్కడకు వెళ్లిన రిపోర్టర్ ను కూడా "ఎవరు నీవు? ఎందుకొచ్చావ్?" అంటూ ఒక స్థానికుడు నిలదీయడం గమనార్హం. నవేద్ కుటుంబ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొహమ్మద్ యాకుబ్ కు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు లెక్చరర్ గా పని చేస్తుండగా, రెండో కొడుకు అల్లిన వస్తువులను అమ్మే చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. మూడో కొడుకే నవేద్. ఇరుగు పొరుగు వారు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇన్ని వివరాలు వెల్లడవుతున్న తరుణంలో కూడా పాక్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News